: ప్లాస్టిక్ బ్యాగులపై జీహెచ్ఎంసీ కొరడా.. 50 మైక్రాన్ల కంటే తక్కువ ఉంటే రూ.10 వేల జరిమానా
కుప్పలు తెప్పలుగా పెరిగిపోతూ పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తున్న ప్లాస్టిక్ బ్యాగుల వాడకంపై జీహెచ్ఎంసీ కొరడా ఝుళిపించింది. 50 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ బ్యాగులను విక్రయించినా, వినియోగించినా రూ.10 వేల జరిమానా విధించేందుకు సిద్ధమైంది. ఇదే నేరంలో రెండోసారి పట్టుబడితే రూ.20 వేలు, మూడోసారి దొరికితే ఆ వ్యాపార సంస్థను(కంపెనీని) సీజ్ చేస్తారు. బుధవారం ఈ మేరకు జీహెచ్ఎంసీ హెచ్చరించింది. పబ్లిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 ప్రకారం రీసైకిల్ ప్లాస్టిక్‌తో తయారుచేసే సంచులు 50 మైక్రాన్ల కంటే తక్కువ ఉండకూడదు. అలాగే వివిధ సాచెట్ల కోసం ఉపయోగించే ప్లాస్టిక్ కూడా 50 మైక్రాన్ల కంటే తక్కువ ఉండకూడదు. కొత్త నిబంధనను పర్యవేక్షించేందుకు అధికారులు స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించనున్నారు. ఎటువంటి రిజిస్ట్రేషన్ లేకుండా ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను తయారు చేస్తున్న సంస్థలపై చర్యలు తీసుకోనున్నట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ డాక్టర్ బి.జనార్దన్ రెడ్డి తెలిపారు. పర్యావరణానికి ప్లాస్టిక్ వల్ల తీవ్ర హాని జరుగుతుండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.