: 'లింగా' క్లైమాక్స్ కామెడీ అయిపోవడంపై వివరణ ఇచ్చిన దర్శకుడు కేఎస్ రవికుమార్!
రజనీకాంత్ నటించిన 'లింగా' చిత్రం క్లైమాక్స్ గుర్తుందా? బైక్ పై నుంచి గాల్లోకి లేచిన హీరో, అంతే వేగంతో ఓ బెలూన్ పై ఎగిరి దుమికి విలన్ ముందుకు వచ్చి ఫైట్ చేస్తాడు. ఈ ఫైటింగ్ ను చూసిన రజనీ అభిమానులు సైతం, కామెడీగా ఉందని, ఎంత రజనీకాంత్ అయినా, ఇలా చూపించడం బాగాలేదని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రస్తావించిన ఆ చిత్ర దర్శకుడు కేఎస్ రవికుమార్, అలా ఎందుకు తీయాల్సి వచ్చిందో వివరించాడు. "చివరి ఫైట్ ను గ్లైడర్ ఉపయోగించి భారీగా తీయాలని భావించాను. అయితే, అప్పటికే చిత్రీకరణ ఆలస్యం అవుతూ రావడం, గ్లైడర్ వాడితే కంప్యూటర్ గ్రాఫిక్స్ పని సినిమా విడుదలను మరింత ఆలస్యం చేస్తుందని భావించాము. అందువల్లే బెలూన్ ను వాడాము. ఇది చాలా కామెడీ అనిపించింది. విమర్శలు వస్తుంటాయి. వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగాలి" అన్నాడు. తెలుగులో చిరంజీవితో 'స్నేహంకోసం' తరువాత మరో చిత్రాన్ని తీయలేదని, మంచి కథ దొరికితే దర్శకత్వం వహిస్తానని చెప్పాడు.