: పోలీసులకు లొంగిపోదామన్న బంధువు... మండిపడ్డ నయీమ్!
సంపాదించింది చాలు, ఇక పోలీసులకు లొంగిపోదామని చెప్పిన తన సమీప బంధువుపై గ్యాంగ్ స్టర్ నయీముద్దీన్ అలియాస్ బాలన్న ఒకానొక సందర్భంలో మండిపడ్డాడట. సరిగ్గా వారం రోజుల క్రితం హైదరాబాద్ తుక్కుగూడలోని నయీమ్ ఫాం హౌజ్ లో అతనికి, అతని సమీప బంధువుకు మధ్య ఈ సంభాషణ జరిగిందని పోలీస్ విచారణలో బయటపడినట్లు విశ్వసనీయ సమాచారం. ‘భాయ్, ఎప్పటికైనా పోలీసుల చేతికి దొరకాల్సిందే. చుట్టూ ఆయుధాలతో ఎన్నాళ్లు బతుకుదాం? పోలీసులకు లొంగిపోయి, చేసిన నేరాలు ఒప్పేసుకుందాం. ఆ తర్వాత డబ్బులు ఖర్చుపెట్టి బెయిల్ తెచ్చుకుందాం. ఉన్న ఆస్తులతో జీవితాన్ని గడుపుదాం’ అని గ్యాంగ్ స్టర్ ను వెన్నంటి ఉండే బంధువు ఒకరు నయీమ్ కు సలహా ఇచ్చాడట. ఈ మాటలకు ఆగ్రహించిన నయీమ్, దేశంలోని మొత్తం పోలీసులు ఒక్కటైనా తనను పట్టుకోలేరని, తన ముందుకు పోలీసులు రాలేరని, తానిచ్చే సమాచారంతోనే పోలీసుల రోజులు గడుస్తున్నాయని, తనిచ్చే డబ్బులతోనే వారు జల్సాలు చేస్తున్నారని అన్నాడట. అంతేకాకుండా, రెండు నెలలు ఓపిక పడితే, ఈ దేశాన్ని వదిలిపెట్టి దుబాయి పారిపోదామని, అక్కడి నుంచే కొత్త కంపెనీని మొదలు పెడదామంటూ నయీం ఆ సంభాషణలో చెప్పాడట. ఇదిలా ఉంటే, వచ్చే దసరాలోపు తను అనుకున్న టార్గెట్ రూ.200 కోట్లు వసూలు చేయాలని వ్యూహ రచన చేశాడట. తన కోటరీలోని 12 మందితో తుక్కుగూడ ఫాంహౌజ్ లో కీలక సమావేశం నిర్వహించాడని సమాచారం. హైదరాబాద్ లో ఉన్న టాప్-30 బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పారిశ్రామికవేత్తల జాబితాను తయారు చేసినట్టూ పోలీసు విచారణలో తేలింది.