: నేను ఇలాగే పోరాడి అమరత్వం పొందాలని కొందరు కోరుకుంటున్నారు: ఇరోం షర్మిల
తాను ఇలాగే పోరాడి అమరత్వం పొందాలని కొందరు కోరుకుంటున్నారని మణిపూర్ ఉక్కు మహిళ ఇరోం షర్మిల (44) మీడియాకు చెప్పారు. ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్‌ను రద్దు చేయాలని కోరుతూ చేస్తోన్న తన 16 ఏళ్ల దీక్షను ఆమె విరమించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు తనను ఓ దేవతలా ఉండాలని కోరుకుంటున్నారని ఆమె అన్నారు. అయితే తాను ఓ సాధారణ మనిషిలా ఉండాలని భావిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. మణిపూర్‌లో తన డిమాండ్ నెరవేరేవరకు, పూర్తి ప్రజాస్వామ్యం వచ్చేవరకు ఉద్యమం కొనసాగిస్తూనే ఉంటానని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆమె కేంద్రంపై విమర్శలు గుప్పించారు. మణిపూర్ ప్రజలను కేంద్రం కూడా వేరుగా చూస్తోందని ఆమె అన్నారు. దేశ ప్రజలకు భిన్నంగా తమ రూపురేఖలు, ఆహారపు అలవాట్లు ఉండడంతో మణిపూర్ వాసులను అలా చూస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి ప్రవేశించి తన పోరాటం కొనసాగిస్తానని ఆమె అన్నారు.