: బోర్డు మాత్రమే మారింది!... టికెట్లు మాత్రం మారలేదు!: తెలంగాణ బస్సుల్లో ఇంకా ఏపీ టికెట్లే!
తెలుగు నేల రెండుగా విడిపోయింది. రాష్ట్ర విభజన జరిగి రెండేళ్లు కూడా పూర్తయింది. ఈ క్రమంలో కొత్త రాష్ట్రం తెలంగాణ తన పరిధిలోని ఏపీ బోర్డులన్నీ పీకేసి వాటి స్థానంలో తెలంగాణ పదాన్ని చేర్చింది. అప్పటిదాకా ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగిన ఏపీఎస్ఆర్టీసీ కూడా రెండుగా విడిపోయింది. నవ్యాంధ్రలో ఆ సంస్థ ఏపీఎస్ఆర్టీసీగానే కొనసాగుతుండగా. తెలంగాణ ప్రభుత్వం మాత్రం దానిని టీఎస్ఆర్టీసీగా మార్చేసింది. అదే పేరుతో బస్సులను తిప్పుతోంది. బస్సులపై ఉన్న ఏపీఎస్ఆర్టీసీ బోర్డులను తీసేసి టీఎస్ఆర్టీసీ పేరును రాసేసింది. ఇక్కడిదాకా అంతా బాగానే ఉన్నా... టీఎస్ఆర్టీసీ పేరుతో తిరుగుతున్న ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటికీ ఇస్తున్న టికెట్లు ఏపీఎస్ఆర్టీసీ పేరిట ముద్రితమైనవే! మెజారిటీ బస్సుల్లో టిమ్స్ ను ప్రవేశపెట్టిన టీఎస్ఆర్టీసీ అధికారులు సదరు మెషీన్ల నుంచి టీఎస్ఆర్టీసీ పేరిటే టికెట్లు ఇస్తున్నారు. అయితే మాన్యువల్ గా కండక్టర్లు ఇస్తున్న టికెట్లపై ఏపీఎస్ఆర్టీసీ ముద్రే ఉంది. వెరసి బోర్డులు మార్చేసిన టీఎస్ఆర్టీసీ అధికారులు... టికెట్ల మార్పిడిపై ఆసక్తి చూపలేదన్న వాదన వినిపిస్తోంది.