: ప్రధాని మోదీది ఇంకా టీ అమ్మిన మనస్తత్వమే.. విరుచుకుపడుతున్న గోరక్షకులు
టీ అమ్మిన స్థాయి నుంచి ప్రధాని అయిన నరేంద్రమోదీ ఇంకా టీ అమ్మిన మనస్తత్వం నుంచి బయటపడలేకపోతున్నారని గోరక్షకులు తీవ్రస్థాయిలో ఆరోపించారు. గోరక్షకులపై ప్రధాని ఇటీవల చేసిన వ్యాఖ్యలకు స్పందించిన పంజాబ్‌లోని పాటియాలా గోరక్షకులు మాట్లాడుతూ పై విధంగా వ్యాఖ్యనించారు. తనను తాను చాయ్‌వాలాగా అభివర్ణించుకునే మోదీ ఇటీవల గోరక్షకులపై తీవ్రస్థాయిలో మండిపడిన సంగతి తెలిసిందే. గోరక్షకుల ముసుగులో సంఘవిద్రోహశక్తులు దళితులు, ముస్లింలపై దాడులు చేస్తున్నాయని, వారు నిజమైన గోరక్షకులు కారని ఇటీవల మోదీ పేర్కొన్న సంగతి తెలిసిందే. పాటియాలో సమావేశమైన గోరక్షాదళ్ సభ్యులు ఆల్ ఇండియా గోరక్షాదళ్‌కు మద్దతు ప్రకటించారు. అలాగే గో సంరక్షణ చర్యలు విరివిగా చేపట్టాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా గోరక్షాదళ్ సభ్యుడు రాకేష్ శర్మ మాట్లాడుతూ ‘‘ఆయన చాయ్‌వాలా నుంచి ప్రధాని స్థాయికి ఎదిగారు. కానీ ఆయన మైండ్‌సెంట్ మాత్రం మారలేదు’’ అని మోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. హిందువులకు పరమ పవిత్రమైన గోవును రక్షించేందుకు తాము కృషి చేస్తుంటే ప్రధాని ఇలా మాట్లాడడం సరికాదని అన్నారు.