: ‘హోదా’ వచ్చేదాకా గడ్డం గీసేది లేదు!... వెంకయ్యకు తేల్చిచెప్పిన మాగంటి బాబు!
టీడీపీ నేత, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఎంపీ మాగంటి బాబు పెంచిన గడ్డం పార్లమెంటులో పెద్ద చర్చకే తెర తీసింది. శరీరాకృతి, తలకట్టులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మాదిరి కనిపించే మాగంటి... తాజాగా అమిత్ షా మాదిరే గడ్డం కూడా పెంచేశారు. దీంతో ఆయనను పార్లమెంటులో ఆంధ్రా అమిత్ షా అంటూ పలువురు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో నిన్న మాగంటి బాబుకు బీజేపీ సీనియర్ నేత, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఓ ప్రశ్న సంధించారు. గడ్డం ఎప్పుడు తీస్తున్నారు? అన్న సదరు ప్రశ్నకు మాగంటి కూడా కాస్తంత ఘాటుగానే సమాధానం చెప్పారు. ‘మీరు ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేదాకా గడ్డం గీసేది లేదు’ అని ఆయన చెప్పిన సమాధానంతో వెంకయ్యకు నోట మాట రాలేదట.