: నయీమ్ పై ‘సిట్’ సభ్యుల ప్రకటన నేడే!... ఐపీఎస్ ల గుండెల్లో రైళ్లు!
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నయీమ్ ఎన్ కౌంటర్, అతడి కార్యకలాపాలపై సమగ్ర దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ సర్కారు నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సిట్ లో ఎవరెవరు ఉంటారన్న విషయం నేడు తేలిపోనుంది. తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ... నేడు సిట్ సభ్యులను ప్రకటిస్తారు. ఈ క్రమంలో ఇటు తెలంగాణ కేడర్ కు చెందిన ఐపీఎస్ లలోనే కాకుండా, అటు ఏపీ కేడర్ ఐపీఎస్ ల గుండెల్లో కూడా రైళ్లు పరుగెడుతున్నాయి. గ్యాంగ్ స్టర్ గా మారకముందు మావోయిస్టుగా ఉన్న నయీమ్ పోలీసులకు లొంగిపోయిన సంగతి తెలిసిందే. నాడు పోలీసు ఉన్నతాధికారుల సూచనల మేరకు కోబ్రాస్ పేరిట ప్రత్యేక దళాలను ఏర్పాటు చేసుకున్న నయీమ్ పలువురు కీలక వ్యక్తులను హత్య చేశాడు. ఈ క్రమంలో అతడు లెక్కపెట్టలేనంత సొమ్మును సంపాదించాడు. నయీమ్ కు చెందిన మొత్తం కార్యకలాపాలపై సమగ్ర దర్యాప్తు అనగానే... నాడు నయీమ్ కు మద్దతు ఇచ్చి, అతడు గ్యాంగ్ స్టర్ గా మారేందుకు సహకరించిన ఐపీఎస్ అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. విచారణలో తమ పేర్లు ఎక్కడ బయటకు వస్తాయోనన్న భావన వారిని బెంబేలెత్తిస్తోంది.