: దక్షిణ చైనా సముద్రంపై ఏమీ మాట్లాడొద్దు: భారత్‌కు చైనా హెచ్చరికలు
వివాదం చెలరేగుతున్న దక్షిణ చైనా సముద్రంపై భారత్ ఏమీ మాట్లాడొద్దని చైనా హెచ్చరించింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత్ పర్యటనకు వస్తోన్న నేపథ్యంలో భారత్‌కు చైనా ఈ హెచ్చరికలు జారీ చేసింది. ఈనెల 13న సుష్మా స్వరాజ్‌తో చైనా విదేశాంగ మంత్రి కొన్ని కీలక ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా అనవసర విషయంలో భారత్ కలగజేసుకోవద్దని, ఇరు దేశాలకు మధ్య ఉన్న సత్సంబంధాలు మరింత తగ్గించుకునేలా చేసుకోవద్దని ప్రభుత్వ పత్రిక గ్లోబల్ టైమ్స్ తన ఎడిటోరియల్‌లో పేర్కొంది. భారత్, చైనాల మధ్య ఆర్థిక సహకారం కొనసాగాలంటే భారత్ దక్షిణ చైనా సముద్రం అంశంపై మౌనం వహించాలని చెప్పింది. చైనా నుంచి దిగుమతి చేసుకొనే ఉత్పత్తులపై పరిమితి విధించాలని కేంద్రం యోచిస్తోన్న సంగతి తెలిసిందే. దేశీయ పరిశ్రమలను గాడిలో పెట్టడానికి భారత్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. అయితే, ఈ అంశానికి తమ దేశం ఒప్పుకోవాలంటే సముద్ర వివాదం పట్ల భారత్ స్పందించకూడదని చైనా షరతు విధించింది. భారత్‌కు ఆ సముద్రం విషయంలో వివాదం ఏమీ లేదని, అటువంటప్పుడు అందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏమీ ఉండబోదని, ఒకవేళ కలగజేసుకుంటే ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు క్షీణిస్తాయని చెప్పింది. ఇది అవసరమా? అనే విషయంపై భారత్ దృష్టి పెట్టాలని పేర్కొంది.