: 'రూ. 50 లక్షలు ఇస్తానని నా నుంచి మెయిల్ వస్తే...': ఏం చేయాలో చెప్పిన రాజన్
తన చివరి పరపతి సమీక్ష తరువాత మీడియాతో మాట్లాడిన ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్, తప్పుడు ఈ-మెయిల్స్ తో ఎంతో మంది ప్రజలు మోసపోతున్న విషయాన్ని మరోసారి గుర్తు చేస్తూ హెచ్చరించారు. తన పేరిటే ఎన్నో రకాలుగా తప్పుడు ఈ-మెయిల్ ఐడీలు సృష్టించారని తెలిపారు. "నా నుంచి లేదా భవిష్యత్తులో ఆర్బీఐ గవర్నర్ గా ఎంపికయ్యే వారి నుంచి మీకు ఏదైనా ఈ-మెయిల్ వచ్చి, అందులో 'మీకు రూ. 50 లక్షలు లాటరీ వచ్చింది. ఖర్చులు, పన్నులు అంటూ రూ. 20 వేలను ఫలానా ఖాతాలో జమ చేయండి' అంటూ ఉంటే, వెంటనే దాన్ని డిలీట్ చేయండి" అని తెలిపారు. ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ రిజర్వ్ బ్యాంక్ ఏ వ్యక్తికీ డబ్బులు ఇవ్వదని అన్నారు. ఈ తరహా మెయిల్స్ ఎంతో నమ్మశక్యంగా ఉంటాయని, ఇలా ఓ మెయిల్ ను తానే ఇవ్వాల్సి వస్తే, ఆ రూ. 20 వేలను తగ్గించుకుని రూ. 49.8 లక్షలను ఇవ్వొచ్చుగా? అని ఆలోచిస్తానని, అదే తరహాలో ఆలోచించే వారెవరైనా మోసపోరని రాజన్ తెలిపారు.