: బెజవాడకు ముందే వచ్చిన పుష్కర శోభ... అద్భుతమంటున్న భక్తులు!
మరో మూడు రోజుల్లో కృష్ణమ్మ పుష్కరాలు ప్రారంభం కానున్న వేళ, కనకదుర్గమ్మ కొలువైన విజయవాడ నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబై పుష్కర శోభను సంతరించుకుంది. నగరంలోని అన్ని వీధులు, ప్రముఖ కట్టడాలు, రోడ్ల కిరువైపులా ఉన్న చెట్లు తదితరాలన్నింటినీ విద్యుద్దీప కాంతులతో అలంకరించగా, వీటిని రాత్రి పూట చూస్తున్న వారు అద్భుతమని కితాబిస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ పిల్లర్లపై ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగుల విద్యుత్ దీపాలతో, ఆపై బ్యారేజ్ ని ఎల్ఈడీ బల్బులతో అలంకరించగా, సీతానగరం వైపు నుంచి చూసేవారికి బ్యారేజ్, ఆపైన వెలిగిపోతున్న ఇంద్రకీలాద్రి దేదీప్యమానంగా దర్శనమిస్తూ సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నాయి. ఇక స్వరాజ్య మైదానంలో ఏర్పాటైన తితిదే నమూనా ఆలయాన్ని గురించి వర్ణించేందుకు ఎన్ని మాటలైనా చాలవంటున్నారు ఇక్కడికి వచ్చిపోతున్న భక్తులు. కళ్లు మిరుమిట్లు గొలిపే రంగురంగుల విద్యుద్దీప కాంతులతో, తాము నిజంగానే తిరుమలలో సంచరిస్తున్నామా? అన్న అనందాన్ని పొందుతున్నామని తెలిపారు.