: మేము ఏం చేయాలనుకుంటున్నామో హైకోర్టుకి తెలియజేశాం: హరీశ్‌రావు
123 జీవో రద్దును నిలిపివేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ రోజు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. నిర్వాసితులకు మంచి ప్రయోజనాలను కల్పిస్తామని ప్రభుత్వం చెప్పడంతో భూసేకరణ చట్టం 2వ షెడ్యూల్‌లోని ప్రయోజనాలన్నీ కల్పించాలని హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. తాము ఏం చేయాలనుకుంటున్నామో హైకోర్టుకి వివరించినట్లు తెలిపారు. ప్రతిపక్షాలు 123 జీవో అంశంపై అనవసరంగా విమర్శలు చేస్తున్నాయని, ప్రాజెక్టులను అడ్డుకుంటున్నాయని హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రం ఆకుపచ్చ తెలంగాణగా మారాలని, రైతులకు, ప్రజలకు నీరు అందేలా చూస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టులకు భూములు ఇచ్చిన వారు త్యాగధనులు అని ఆయన అన్నారు. వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని స్పష్టం చేశారు.