: నయీమ్ ఇల్లు సీజ్!... రూ.2 వేల కోట్ల ఆస్తులు, 2 కిలోల బంగారం స్వాధీనం!
తెలంగాణ పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా మారిన గ్యాంగ్ స్టర్ నయీమ్ ఎన్ కౌంటర్ తో పోలీసులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. నిన్న ఉదయమే మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో నయీమ్ హతం కాగా సాయంత్రానికే పోలీసులు సోదాలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో హైదరాబాదులోని అలకాపురిలోని నయీమ్ ఇంటిలో సోదాలు చేసిన పోలీసులు భారీ ఎత్తున నగదు, స్థిరాస్తులకు చెందిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత నగదును కౌంటింగ్ మిషన్లతో లెక్కపెట్టిన పోలీసులు ఆ నగదు విలువను రూ.2.5 కోట్లకు పైగానే ఉన్నట్లు తేల్చారు. ఇక నయీమ్ ఇంటిలో 2 కిలోల బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ స్థిరాస్తుల పత్రాల విలువ రూ.2 వేల కోట్లకు పైగానే ఉన్నట్లు సమాచారం. ఈ మేర భారీ స్థాయిలో ఆస్తులు పట్టుబడటంతో ఆ ఇంటిని పోలీసులు సీజ్ చేశారు.