: అప్పట్లో ఆడ పిల్లలకు 'జ్యోతిలక్ష్మి' అనే పేరు పెట్టుకోవడానికి సంశయించేవారు!
జ్యోతిలక్ష్మి... 1970వ దశకంలో నృత్య కళాకారిణిగా చలనచిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి, తన అందచందాలతో ఆనాటి కుర్రకారు మతిపోగొట్టిన నటి. వ్యాంప్ పాత్రలకు పెట్టింది పేరు. ఎన్టీ రామారావు, కృష్ణ వంటి సూపర్ స్టార్లు చిత్రసీమను రాజ్యమేలుతున్న రోజుల్లో జ్యోతిలక్ష్మి లేదా జయమాలినితో ఓ పాట లేని సినిమా చాలా అరుదుగా వచ్చేవి. ముఖ్యంగా 1980వ దశకంలో ఆమె పాట ఒక్కటి ఉంటే చాలు, సినిమా సూపర్ హిట్టన్న ధోరణి కనిపించేది. జ్యోతిలక్ష్మి వయ్యారాలు, నడుము తిప్పుతూ చేసే నృత్యాలకు ప్రేక్షకులు ఫిదా అయిపోయేవారు. దాదాపు 300 చిత్రాల్లో ఆమె నటిస్తే, అందులో 250 వరకూ ఐటమ్ సాంగ్స్ ఉన్నాయంటే, ఆమె హవా ఎలా నడిచిందో చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఎవరింటనైనా ఆడపిల్ల పుట్టిందంటే, జ్యోతిలక్ష్మి పేరును పెట్టాలన్న ప్రతిపాదన వస్తే, అందుకు ససేమిరా అన్న రోజులు కొన్ని సంవత్సరాలపాటు గడిచాయంటే అతిశయోక్తి కాదు. అంతగా ప్రభావం చూపిన జ్యోతిలక్ష్మి గత వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఈ ఉదయం కన్నుమూశారు. ఎనిమిదేళ్ల ప్రాయంలో శివాజీ గణేశన్ నటించిన 'కార్తవరాయన్' చిత్రంలో నృత్యం చేసి తెరపై కాలుపెట్టిన జ్యోతిలక్ష్మి, 1967లో వచ్చిన 'పెద్దక్కయ్య' చిత్రంలో తెలుగు చిత్ర సీమకు పరిచయమైంది. 1973లో శోభన్ బాబు హీరోగా నటించిన 'ఇదాలోకం' చిత్రంలో 'గుడి ఎనకా నా సామి గుర్రమెక్కి కూకున్నాడు' అంటూ వచ్చిన పాటతో ఆమె అభిమానుల గుండెల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకుంది. ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ చిత్రం 'సర్దార్ పాపారాయుడు' 50 రోజులు ఆడిన తరువాత, కాస్తంత కలెక్షన్లు తగ్గాయని అనిపించడంతో 'జ్యోతిలక్ష్మి చీరకట్టింది...' అనే ఓ పాటను షూట్ చేసి జోడిస్తే, ఆ పాట కోసమే సినిమాను మళ్లీ మళ్లీ చూసినవారున్నారంటే ఆమె పాప్యులారిటీని అర్థం చేసుకోవచ్చు. సోదరి జయమాలిని, సిల్క్ స్మిత వంటి నవతరం డ్యాన్సర్లు తెరపైకి వచ్చిన తరువాత, జ్యోతిలక్ష్మికి అవకాశాలు తగ్గిపోగా, కెమెరామెన్ సాయిప్రసాద్ ను వివాహం చేసుకుని చిత్రసీమకు దూరమయ్యారు. అడపాదడపా తనకు నచ్చిన పాత్రల్లో నటిస్తూ వచ్చారు. బుల్లితెరపైనా కాలుమోపారు. మోసగాళ్లకు మోసగాడు, గండరగండడు, పిల్లా పిడుగా, గాంధర్వ కన్య, సీతారాములు, బెబ్బులి, బాబులుగాడి దెబ్బ, స్టేట్ రౌడీ, బిగ్ బాస్, కలుసుకోవాలని, దొంగరాముడు అండ్ పార్టీ, బంగారుబాబు తదితర చిత్రాల్లో గుర్తింపును తెచ్చే పాత్రలు పోషించి మెప్పించారు. ఆమె మృతికి సినీ ప్రముఖులంతా సంతాపం తెలుపుతున్నారు.