: దూబగుంట రోశమ్మ కుటుంబానికి బాలయ్య బాసట!...రూ.50 వేలు పంపించిన హిందూపురం ఎమ్మెల్యే!


సారాపై కదం తొక్కి... టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత సీఎం నందమూరి తారకరామారావును సంపూర్ణ మద్య నిషేధంపై నిర్ణయం తీసుకునేలా చేసిన దూబగుంట రోశమ్మ మొన్న చనిపోయారు. నిన్న నెల్లూరు జిల్లాలోని కలిగిరి మండలంలోని దూబగుంటలో ఆమె భౌతికకాయానికి అంత్యక్రియలు పూర్తయ్యాయి. రోశమ్మ కారణంగా తన తండ్రి ఎన్టీఆర్ ప్రభావితమైన తీరును ఓసారి మననం చేసుకున్న టాలీవుడ్ అగ్ర హీరో, అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చలించిపోయారు. రోశమ్మ అంత్యక్రియలకు హాజరుకావాలని భావించినా... అనివార్య కారణాల వల్ల ఆయన అక్కడికి వెళ్లేకపోయారు. అయితే రోశమ్మ కుటుంబానికి మాత్రం బాలయ్య బాసటగా నిలిచారు. తాను అంత్యక్రియలకు వెళ్లలేకపోయినా.. రూ.50 వేలను ఆయన రోశమ్మ కుటుంబ సభ్యులకు చేరవేశారు. బాలయ్య ఆదేశాలతో నెల్లూరు నగర టీడీపీ అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి దూబగుంటకు వెళ్లి... బాలయ్య పంపిన రూ.50 వేల చెక్కును రోశమ్మ కుటుంబ సభ్యులకు అందజేశారు. రోశమ్మ మనవలకు ఎన్టీఆర్ ట్రస్ట్ నడుపుతున్న మోడల్ స్కూళ్లలో విద్యనందిస్తామని, మనవరాలికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని ఈ సందర్భంగా కోటంరెడ్డి హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News