: దీక్ష విరమించనున్న ‘మణిపూర్ ఐరన్ లేడీ’.. నేటితో 16 ఏళ్ల దీక్షకు తెర
మణిపూర్ ఉక్కు మహిళ ఇరోం షర్మిల చాను(44) తన 16 ఏళ్ల దీక్షను నేడు విరమించనున్నారు. ఆర్మ్‌డ్ ఫోర్సెస్(స్పెషల్ పవర్స్) యాక్ట్ 1958కు వ్యతిరేకంగా దశాబ్దంన్నరగా ఆమె దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. తాను దీక్ష విరమించి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు గతనెల 26న షర్మిల ప్రకటించారు. అలాగే తన బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకుని సాధారణ జీవితం గడపాలనుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఈరోజు(మంగళవారం) ఆమెను ఇంఫాల్‌లోని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. దీక్ష విరమణపై ఆమె స్పష్టమైన ప్రకటన చేసిన అనంతరం షర్మిలను విడిచిపెట్టాల్సిందిగా చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ ఆదేశాలు ఇస్తారు. ఇంటికి వచ్చే ఆమెకు సాదర స్వాగతం పలికేందుకు షర్మిల కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. అయితే ఆమె నేరుగా ఇంటికి వస్తుందో రాదో తమకు తెలియదని వారు పేర్కొన్నారు. కుమార్తె కోసం ప్రత్యేకంగా ఓ గదిని కూడా కేటాయించినట్టు షర్మిల తల్లి సఖీదేవి తెలిపారు. కోర్టులో ఆమె ఏం చెబుతుందో వినాలని ఉందని, కోర్టుకు వెళ్తున్నానని షర్మిల సోదరుడు సింఘాజిత్ పేర్కొన్నారు.