: తమిళనాట చంద్రబాబుపై ఆగని నిరసనలు!... కోయంబేడు బస్టాండ్ వద్ద ఏపీ సీఎం దిష్టిబొమ్మ దహనం!


తమిళనాట ఏపీ ప్రభుత్వంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల చిత్తూరు జిల్లా పోలీసులు ఎర్రచందనం స్మగ్లర్ల పేరిట అరెస్ట్ చేసిన 32 మంది తమిళుల అంశమే ఆ ఆందోళనలకు కారణమైంది. అరెస్టైన వారంతా తిరమల వెంకన్నను దర్శించుకునేందుకే ఏపీకి వెళ్లారని తమిళనాడు సీఎం జయలలిత సహా తమిళనాడు విపక్ష నేత కరుణానిధి కూడా వాదిస్తున్నారు. ఇదే కారణాన్ని చెబుతూ అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని వారు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడికి ప్రత్యేకంగా లేఖలు రాశారు. ఈ విషయంపై తమిళనాడులో నిరసనలు హోరెత్తుతున్నాయి. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ మనవడి పెళ్లి కోసం తమిళనాడులోని కోయంబత్తూరుకు చంద్రబాబు వెళ్లిన సందర్భంగా... ఆయన బస చేసిన హోటల్ బయట తమిళులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. తాజాగా నిన్న చెన్నైలోని కోయంబేడు బస్టాండ్ పరిధిలో తమిళనాడుకు చెందిన తమిళర్ మున్నేట్ర పడై అనే సంస్థకు చెందిన కార్యకర్తలు నిరసనకు దిగారు. బస్టాండులో ధర్నాకు దిగిన ఆ సంస్థ కార్యకర్తలు ఆ తర్వాత చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆ సంస్థ అధ్యక్షురాలు వీరలక్ష్మి మాట్లాడుతూ తిరుమల వెంకన్న దర్శనం కోసం వెళ్లిన తమ వారిని అరెస్ట్ చేయడం దారుణమన్నారు. తక్షణమే అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలన్నారు. పాలారు నదిపై ఏపీ సర్కారు నిర్మిస్తున్న ప్రాజెక్టు ఎత్తును కూడా తగ్గించాలని ఆమె డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News