: వనీ ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారం.. ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్లను కాల్చి చంపిన ‘హిజ్బుల్’
బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్‌తో రగలిపోతున్న హిజ్బుల్ ముజాహిదీన్ సోమవారం బీఎస్ఎఫ్ పోస్ట్‌పై దాడిచేసి ముగ్గురు జవాన్లను కాల్చిచంపింది. ఈ ఘటనకు పాల్పడింది తామేనని ప్రకటించిన హిజ్బుల్.. వనీ హత్యకు ఇది నివాళి అని పేర్కొంది. గత నెలలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భారత దళాలు ఉగ్రవాది బుర్హాన్ వనీని మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. వనీ ఎన్‌కౌంటర్ అనంతరం కశ్మీర్‌లో చెలరేగిన అల్లర్లలో 55 మంది మృతి చెందారు. కశ్మీర్‌లో పరిస్థితి ఇప్పటికీ ఉద్రిక్తంగానే ఉంది. కుప్వారా జిల్లాలోని అధీనరేఖకు సమీపంలోని మాచిల్ సెక్టార్‌లో బీఎస్‌ఎఫ్ పోస్టుపై మిలిటెంట్లు దాడికి తెగబడ్డారు. ఈ సందర్భంగా మిలిటెంట్లకు, దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ మిలిటెంట్ సహా ముగ్గురు జవాన్లు మృతి చెందారు. వనీకి నివాళులు అర్పించేందుకే ఈ దాడికి పాల్పడినట్టు హిజ్బుల్ అధికార ప్రతినిధి బుర్హాన్-ఉద్-దిన్ పేర్కొన్నాడు. కశ్మీర్‌లో పరిస్థితులు చక్కదిద్దేందుకు చర్చలు జరపాలని ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ప్రధానిని కోరిన రోజే ఈ దాడి జరగడం గమనార్హం. కాగా వేర్పాటు వాదులు తమ ఆందోళనను ఈనెల 12 వరకు పొడిగించారు.