: జీఎస్‌టీ బిల్లుకు లోక్‌సభలో ఆమోదం... హర్షం వ్యక్తం చేసిన కేంద్రం


ఇటీవ‌లే రాజ్య‌స‌భ‌లో ఆమోదం పొందిన వస్తు సేవలపన్ను(జీఎస్‌టీ) బిల్లు ఈరోజు లోక్‌సభలోనూ ఆమోదం పొందింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ప్ర‌వేశ‌పెట్టిన బిల్లుపై ఓటింగ్ అనంత‌రం బిల్లు ఏక‌గ్రీవంగా ఆమోదం పొందిన‌ట్లు స్పీక‌ర్ సుమిత్రామ‌హాజ‌న్ పేర్కొన్నారు. బిల్లు ఆమోదం పొంద‌డం ప‌ట్ల ఎన్డీఏ నేత‌లు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. జీఎస్‌టీ ఆమోదం ప్ర‌జాస్వామ్య విజ‌యంగా మోదీ అభివ‌ర్ణించారు. బిల్లుపై ఓటింగ్ జరుగుతున్నప్పుడు అన్నాడీఎంకే చేసిన వాకౌట్ మినహా అన్ని అంశాలు ఎటువంటి గందరగోళం లేకుండా ముందుకుసాగాయి. జీఎస్‌టీ బిల్లు గత ఏడాదే లోక్‌సభలో ఆమోదం పొందిన విష‌యం తెలిసిందే. అయితే రాజ్యసభలో బిల్లుపై చ‌ర్చ అనంత‌రం బిల్లుకి ప‌లు సవరణలు చేశారు. దీంతో మ‌ళ్లీ బిల్లు లోక్‌స‌భ‌ ఆమోదం పొందాల్సి వుండ‌గా బిల్లు ఈరోజు సభ ముందుకు వచ్చింది. 122వ రాజ్యాంగ సవరణ బిల్లుకి లోక్‌స‌భ ఏక‌గ్రీవ ఆమోదం తెలిపింది. వచ్చే ఏడాది ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే ఈ బిల్లుని అమల్లోకి తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది.

  • Loading...

More Telugu News