: జ్ఞాపకాలే మిగిలాయి.. నేడు చిన్నారి రమ్య తొమ్మిదవ పుట్టిన రోజు.. కేక్ కట్ చేసిన రమ్య చెల్లెలు
హైదరాబాద్‌లోని పంజాగుట్టలో ఇటీవల తాగుబోతుల దాష్టీకానికి బలైన చిన్నారి రమ్య తొమ్మిదవ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా హైదరాబాద్ నక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో రమ్య చదువుకున్న స్కూల్ విద్యార్థులు ఆమె పుట్టిన రోజు కేక్‌ను చిన్నారి రమ్య చెల్లి రష్మితో కట్ చేయించారు. రమ్య పుట్టినరోజు వేడుకలో విద్యార్థులు, రమ్య తండ్రి వెంకటరమణ, అమ్మమ్మ, డీసీపీ రంగనాథ్, తదితరులు పాల్గొన్నారు. మైనర్లు వాహనాలు నడపడం, మద్యం సేవించడం వంటి చర్యలకు పాల్పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా చిన్నారులు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు తన అక్కంటే చాలా ఇష్టమని, తనకు రమ్య టీచర్‌లా చదువులో సాయం చేసేదని, ఫ్రెండ్‌లా తనతో ఆడుకునేదని రమ్య చెల్లి రష్మి చెప్పింది. తాగి వాహనాలు నడిపే వారిని కఠినంగా శిక్షించాలని రమ్య అమ్మమ్మ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా డీసీపీ రంగనాథ్ మాట్లాడుతూ.. వాహనాలు నడుపుతున్న మైనర్లకు తాము కౌన్సెలింగ్ ఇస్తున్నామని పేర్కొన్నారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతోన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కాగా, ప్రమాదంలో తీవ్రగాయాలపాలయిన రమ్య తల్లి ఇప్పటికీ కోలుకోలేదు.