: ‘క్విట్ చంద్రబాబు సేవ్ ఏపీ’ అని ప్రతి ఒక్కరు నినదించాలి: బొత్స
రోడ్ల విస్తరణ, అభివృద్ధి పనుల్లో భాగంగా విజయవాడ ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లోని గాంధీజీ విగ్రహాన్ని తొలగించి విషయం తెలిసిందే. అనంతరం ఆ విగ్రహం ఎక్కడ ఉందంటూ వెతికిన పలువురికి అది కాల్వలో లభించింది. దీనిపై విమర్శలు రావడంతో తిరిగి ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లోనే విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహాన్ని కాల్వలో పడివేయడం పట్ల వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి గాంధీ విగ్రహాన్ని ఈరోజు ఆయన తమ పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. అనంతరం బొత్స మీడియాతో మాట్లాడుతూ.. ‘క్విట్ చంద్రబాబు, సేవ్ ఏపీ’ అని ప్రతి ఒక్కరు నినదించాలని అన్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ చర్యకు పాల్పడిన జిల్లా స్థాయి అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు.