: కొన్ని వివరాలు... మరింత గోప్యత!: నయీమ్ ఎన్ కౌంటర్ పై రమా రాజేశ్వరి కామెంట్స్!
తెలంగాణ పోలీసులకు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ గా మారిన నయీమ్ ఈరోజు జరిగిన ఎన్ కౌంటర్ లో చనిపోయాడు. నేటి ఉదయం పాలమూరు జిల్లా షాద్ నగర్ లో చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికీ పూర్తి వివరాలు వెల్లడించడం లేదు. ఎన్ కౌంటర్ లో నయీమ్ చనిపోయాడని ప్రకటించిన పోలీసులు... మిగిలిన వివరాలను మాత్రం వెల్లడించడం లేదు. ఈ మేరకు ఘటనా స్థలిలో మీడియా ముందుకు వచ్చిన పాలమూరు జిల్లా ఎస్పీ రమా రాజేశ్వరి ఎన్ కౌంటర్ కు సంబంధించి కొన్ని వివరాలు మాత్రమే వెల్లడించారు. పక్కా సమాచారంతోనే తాము జరిపిన దాడిలో నయీమ్ చనిపోయాడని రమా రాజేశ్వరి తెలిపారు. అయితే నయీమ్ తలదాచుకున్న భవనంలో ఎంత మంది ఉన్నారు? ఎంతమంది చనిపోయారు? అన్న వివరాలను ఆమె వెల్లడించలేదు. భవనంలో ఇంకా పరిశీలన కొనసాగుతోందని, పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని ఆమె చెప్పారు. ఎన్ కౌంటర్ లో ఓ మెషీన్ గన్, మరో పిస్టల్ ను స్వాధీనం చేసుకున్నామని ఆమె తెలిపారు.