: వెళ్లే ముందు మురిపించేనా?... అందరి కళ్లూ రాజన్ పైనే!


మరో నెలన్నరలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ పదవిని వీడనున్న రఘురాం రాజన్ నేతృత్వంలో తుది పరపతి సమీక్ష రేపు జరుగనుండగా, మార్కెట్ వర్గాలు ఆసక్తితో ఎదురు చూస్తున్నాయి. పదవీ విరమణ చేయబోయే ముందు ఆయన వడ్డీ రేట్లను తగ్గించే దిశగా నిర్ణయం తీసుకుంటారా? అన్నది ఆసక్తికరంగా మారింది. తన చివరి పాలసీ సమీక్ష కాబట్టి, ఆయన ఎటువంటి చర్యలూ ప్రకటించకపోవచ్చని, తదుపరి గవర్నర్ పైనే బాధ్యతలు ఉంచుతారని ఓ వర్గం అంటుండగా, తగ్గిన ద్రవ్యోల్బణం, పెరిగిన ఎగుమతులు, సంతృప్తికరమైన వర్షపాతం నేపథ్యంలో పావు నుంచి అర శాతం వరకూ వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్టు ఆయన ప్రకటించి వీడ్కోలు బహుమతిని ఇచ్చే అవకాశాలు ఉన్నాయని మరికొందరు భావిస్తున్నారు. వచ్చే నెలలో పదవీ విరమణ చేసే రాజన్, ఆపై అమెరికాకు వెళ్లి ఉపాధ్యాయ బాధ్యతలను నిర్వహిస్తానని ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఆయన మూడేళ్ల పాటు భారతావనికి సేవలందించగా, రాజన్ తీసుకున్న కొన్ని కఠిన నిర్ణయాలు విమర్శలకు కారణమైనప్పటికీ, ఆ ఫలాలు ప్రజలకు అందాయి. అంతకుముందు దువ్వూరి సుబ్బారావు గవర్నర్ గా ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాలతో రూపాయి విలువ పతనం కాగా, దాన్ని స్థిరీకరించేందుకు రాజన్ తన వంతు ప్రయత్నాలు చేసి విజయం సాధించారు. ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని 4 శాతంగా నిర్దేశించుకుని దాన్ని అందుకునేందుకు పరుగులు పెట్టి లక్ష్యానికి దగ్గరగా చేరారు. 6 శాతానికి పడిపోయిన స్థూల జాతీయోత్పత్తిని ఏడున్నర శాతానికి చేర్చారు. ఆర్బీఐ గవర్నరుగా చివరి పరపతి సమీక్ష అనంతరం ఆయన ప్రసంగంలో దేశ ఆర్థిక భవిష్యత్తుపై తన ఆలోచనలను పంచుకోవచ్చని భావిస్తున్నామని యాక్సిస్ బ్యాంకు ఎకానమిస్ట్ సౌగత్ భట్టాచార్య అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ద్రవ్య, పాలనా విధానాలతో సమన్వయం చేసుకుంటూ, పరపతి సమీక్షా నిర్ణయాలు వెలువరించడం సవాలుతో కూడుకున్నదని, ప్రపంచంలోనే నమ్మకమైన సెంట్రల్ బ్యాంకుగా గుర్తింపున్న ఆర్బీఐ, ఇండియాను పెట్టుబడులకు మరింత ఆకర్షణీయం చేసే దిశగా మరింత శ్రమించాల్సి వుందని అన్నారు. కాగా, వేతన సంఘం సిఫార్సుల నేపథ్యంలో, అవి అమలైతే ద్రవ్యోల్బణాన్ని పెంచుతుందన్న అనుమానాల నేపథ్యంలో వచ్చే మార్చి నాటికి 5 శాతం వరకూ ఇన్ ఫ్లేషన్ చేరుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావించిన డ్యూటస్చ్ బ్యాంక్ ఆర్థికవేత్త కౌశిక్ దాస్, పెరిగే ద్రవ్యోల్బణమే దేశం ముందున్న అతిపెద్ద రిస్క్ గా అభివర్ణించారు. వచ్చే జనవరి నాటికి 5 శాతానికి, 2018 మార్చి నాటికి 4 శాతానికి ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక పరపతి సమీక్ష జరిపి నిర్ణయాలు వెలువరించే అధికారం ఉన్న చివరి ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ మాత్రమే. ఆపై పరపతి సమీక్షలో ముగ్గురు కేంద్రం నియమించే వ్యక్తులు, ముగ్గురు ఆర్బీఐ ప్రతినిధులు ఓటింగ్ ద్వారా నిర్ణయాలను తీసుకోనుంటారన్న సంగతి తెలిసిందే. వీరి ఓట్లు సమానమైన సమయంలో ఆర్బీఐ గవర్నర్ తన విశేష ఓటును ఏ వైపు వేస్తే, ఆ నిర్ణయం అమలవుతుంది. ఈ నేపథ్యంలో రాజన్ చివరి పరపతి సమీక్షపై మార్కెట్ వర్గాలు, పెట్టుబడిదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

  • Loading...

More Telugu News