: హిందూ నేతలను చంపేందుకు, చర్చిలపై దాడులకు కొత్త ఉగ్ర బ్యాచ్ ని తయారు చేస్తున్న డీ-కంపెనీ!
ఇండియాలో హిందూ నేతలను హత్యలు చేసేందుకు కొత్త ఉగ్రవాద బ్యాచ్ ని అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నేతృత్వంలోని డీ-కంపెనీ ఏర్పాటు చేసిందని ఎన్ఐఏ పసిగట్టింది. 2002 నాటి గుజరాత్ అల్లర్లకు ప్రతీకారంగా ఇండియాలో మత కల్లోలాలు సృష్టించడమే వీరి ప్రధాన ఉద్దేశమని పేర్కొంది. హిందూ నేతల హత్యలతో పాటు, చర్చ్ లలో మద్యం బాటిల్స్ విసిరి అలజడి సృష్టించాలన్నది వీరి ప్లాన్ గా పేర్కొంటూ ఓ చార్జ్ షీట్ దాఖలు చేసింది. డీ-కంపెనీకి ఇంటర్నేషనల్ క్రైమ్ సిండికేట్ కూడా సహకరిస్తోందని, తమ కార్యకలాపాల్లో పాల్గొనే వారికి భారీ ఎత్తున డబ్బు ఇవ్వడంతో పాటు, విదేశాల్లో ఉద్యోగాలను ఆఫర్ చేసిందని ఎన్ఐఏ పేర్కొంది. తాము చెప్పిన చోట పెట్రోల్ బాంబులేసి పారిపోవాలని, హిందూ నేతలను చంపేయాలని కోరిందని, గుజరాత్ లో బీజేపీ నేత, ఆర్ఎస్ఎస్ సీనియర్ సభ్యుడు శిరీష్ బంగాలీ, బీజేపీ కార్యదర్శి ప్రగ్నేష్ మిశ్రా హత్యకేసులో నిందితులుగా ఉన్న పది మందిపై వేసిన తాజా చార్జ్ షీట్ లో పేర్కొంది. వీరి వెనుక దావూద్ గ్యాంగ్ వుందని వెల్లడించింది. డీ-కంపెనీలోని జావేద్ చిక్నా, జాహిద్ మియాన్, అబీద్ పటేల్, యూనిస్ అలియాస్ మంజ్ రావ్ లు బీజేపీ నేతల జాబితా తయారు చేయాలని కోరారని వెల్లడించింది.