: జకీర్ నాయక్‌కు మరో ఎదురుదెబ్బ.. త్వరలో ఐఆర్ఎఫ్ మూత
వివాదాస్పద మత బోధకుడు, టెలివిజనిస్ట్ జకీర్ అబ్దుల్ కరీం నాయక్‌కు చెందిన ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్(ఐఆర్ఎఫ్)పై నిషేధం విధిస్తున్నట్టు న్యాయమంత్రిత్వ శాఖ ప్రభుత్వానికి సమాచారం అందించింది. ఫిజీషియన్ నుంచి మతబోధకుడుగా మారిన జకీర్ బోధనలు ఉగ్రవాదంవైపు యువకులను ఆకర్షించేవిగా ఉన్నాయంటూ ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. 2005, 2012లో రెండుసార్లు జకీర్‌పై ఎఫ్ఆర్ నమోదై ఉండడాన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయ మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. చట్ట విరుద్ధ కార్యకలాపాల(నిరోధక) చట్టం(యూఏపీఏ) కింద జకీర్ నాయక్ 1991లో స్థాపించిన ఐఆర్ఎఫ్ను చట్టవిరుద్ధమైన సంస్థగా ప్రకటించింది. లాభాపేక్ష లేని సేవా సంస్థగా ఐఆర్ఎఫ్ను పేర్కొంటున్న జకీర్ సమావేశాల ద్వారా నిధులు సమకూరుస్తున్నట్టు హోం మంత్రిత్వశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. యూఏపీఏ కింద ఈ సంస్థపై ఐదేళ్లపాటు నిషేధం విధించనున్నారు. ప్రస్తుతం జకీర్ పశ్చిమ ఆసియాలో ఉన్న సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌లో ఉగ్రదాడి అనంతరం అక్కడి ప్రభుత్వం జకీర్ పీస్ టీవీని నిషేధించింది.