: రియోలో చరిత్ర సృష్టించిన దీపా కర్మాకర్.. ఫైనల్‌కు చేరిన మొట్టమొదటి ఇండియన్ జిమ్నాస్ట్
భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించింది. జిమ్నాస్టిక్స్‌లో తొలిసారి ఫైనల్ చేరిన భారత క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది. ఆదివారం జరిగిన మహిళ క్వాలిఫయింగ్ రౌండ్‌లో త్రిపురకు చెందిన దీప.. వాల్ట్ విభాగంలో 14.850 పాయింట్లు సాధించి ఫైనల్లోకి ప్రవేశించి పతకంపై ఆశలు రేపింది. ఆల్‌రౌండ్ విభాగంలో దీప ఓవరాల్‌గా 51.665 పాయింట్లు స్కోర్ చేసి 27వ స్థానంలో నిలిచింది. మరోవైపు రెండోరోజు ఒలింపిక్స్‌లో భారత్‌కు నిరాశే ఎదురైంది. వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను చేతులెత్తేసింది. టెన్నిస్‌లో పేస్-బోపన్న జోడి తొలిరౌండ్‌లోనే ఇంటిముఖం పట్టగా మహిళల డబుల్స్‌లో సానియా-ప్రార్థన జోడి ఘోరంగా ఓడిపోయింది. టేబుల్ టెన్నిస్‌లో భారత పోరాటం ముగిసింది. మహిళల్లో మౌమా దాస్, మౌనికా బత్రా, పురుషుల సింగిల్స్‌లో శరత్ కమల్, సౌమ్యజీత్ ఘోష్ పరాజయం పాలయ్యారు. షూటింగ్‌లో స్టార్ షూటర్ హీనా సిద్దూ నిరాశపరిచాడు. ఇక పతకంపై ఆశలు రేపిన భారత మహిళల ఆర్చరీ జట్టు క్వార్టర్స్‌తోనే సరిపెట్టుకుంది.