: తెలంగాణ సర్కారు చర్యలతో ఈరోజు ప్రజాస్వామ్యం ఖూనీ అయింది: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
తెలంగాణ సర్కారుపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని హోదాలో తొలిసారి నరేంద్రమోదీ రాష్ట్రానికి చేరుకుంటున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలను అరెస్టు చేయడం అన్యాయమని ఆయన మండిపడ్డారు. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లకి తరలించడం, కొందరిని హౌస్ అరెస్ట్‌లు చేయడం జరిగిందని ఆయన అన్నారు. దీంతో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని ఆయన విమర్శించారు. మోదీ పర్యటన సందర్భంగా మంచి వాతావరణం ఉండేలా చూసుకోవాల్సింది పోయి తెలంగాణ ప్రభుత్వం ఇటువంటి చర్యలను కొనసాగించడం భావ్యం కాదని ఆయన అన్నారు. కనీస హక్కులు కూడా ఇవ్వకుండా రాష్ట్రంలో ఫాసిస్టు పాలన కొనసాగిస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ సర్కారు అణచివేతపై కూడా మోదీ దృష్టి సారించాలని ఆయన పేర్కొన్నారు.