: ఎన్నికల్లో జయలలిత ఖర్చు రూ.24.55 లక్షలేనట.. అఫిడవిట్లో పేర్కొన్న తమిళ సీఎం
ఏఐఏడీఎంకే చీఫ్, తమిళనాడు ముఖ్యమంత్రి జె.జయలలిత ఇటీవల ముగిసిన ఎన్నికల్లో చేసిన ఖర్చు గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఎన్నికల్లో ఓ అభ్యర్థి అత్యధికంగా రూ.28 లక్షల వరకు ఖర్చు చేసుకునే అవకాశం ఉండగా ఆమె రూ.24.55 లక్షలే ఖర్చు చేశారట. ప్రతిపక్ష పార్టీ నేత ఎంకే స్టాలిన్ ఆమె కన్నా చాలా తక్కువగా రూ.11 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టారు. ఇక తమిళనాడులో గెలిచిన అభ్యర్థుల్లో చాలామంది ఎన్నికల్లో రూ.7 నుంచి రూ.15 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టారు. చెన్నై జిల్లా ఎన్నికల అధికారికి ముఖ్యమంత్రి జయ సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఎన్నికల్లో ఆమె మొత్తంగా రూ.24,55,651 ఖర్చు చేశారు. ఇందులో రూ.18 లక్షలు ఆమె సొంత డబ్బులు. అలాగే తాత్కాలిక పార్టీ కార్యాలయం కోసం వాషర్మెన్పేటలో తీసుకున్న భవనానికి రూ.32 వేల అద్దె చెల్లించారు. భవనానికి కరెంటు, జనరేటర్ చార్జీల కింద మరో రూ.31,550 చెల్లించారు. డీఎంకే నేత ఎంకే స్టాలిన్ రూ.11.02 లక్షలు ఖర్చు చేశారు. రూ.25 లక్షల నిధులు సేకరించారు. వీటిలో రూ.15 లక్షలు పార్టీ ఇచ్చింది. సామాజిక మాధ్యమాల్లో ప్రచారానికి స్టాలిన్ రూ.4.59 లక్షలు ఖర్చు చేశారు. అలాగే రూ.24వేలు విద్యుత్ బిల్లల కింద చెల్లించారు. మిగతా వారిలో చాలామంది ఎమ్మెల్యేలు రూ.7 లక్షల నుంచి రూ.15 లక్షల లోపే ఎన్నికల కోసం ఖర్చు చేసినట్టు అఫిడవిట్లో పేర్కొన్నారు.