: కాలేజ్ అమ్మాయికి మర్చిపోలేని బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన హృతిక్ రోషన్
సింధులోయ నాగరికతను ఆవిష్కరిస్తూ హృతిక్‌రోషన్, పూజాహెగ్డే కాంబినేషన్లో బాలీవుడ్లో రూపుదిద్దుకున్న సినిమా ‘మొహంజోదారో’. ఈ మూవీ ఆగస్టు 12న విడుదల కానున్న నేపథ్యంలో దాని ప్రచారంలో భాగంగా ఢిల్లీలో తాజాగా హృతిక్ సందడి చేశాడు. హీరోయిన్ పూజా హెగ్డేతో కలిసి అక్కడి ఓ ఉమెన్స్ కాలేజ్‌కి వెళ్లిన హృతిక్.. అక్కడి ఒక అమ్మాయికి తనతో కలిసి డ్యాన్స్ చేసే అవకాశం పిలిచి మరీ ఇచ్చాడు. హృతిక్, పూజా కాలేజీ అమ్మాయిలతో సరదాగా ముచ్చటించారు. కాలేజీ అమ్మాయిలు అడుగుతోన్న ప్రశ్నలకు వారు జవాబులిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ అమ్మాయి తన పుట్టినరోజు జరుపుకుంటోందని హృతిక్‌కి తెలిసింది. దీంతో ఆ అమ్మాయిని హృతిక్ వేదికపైకి ఆహ్వానించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఆమెతో కలిసి ‘జిందగీ న మిలేగీ దొబారా’ చిత్రంలోని హిట్ సాంగ్ సెనోరీటా పాటకు హృతిక్ డ్యాన్స్ చేశాడు. హృతిక్ తో డ్యాన్స్ చేసిన ఆ అమ్మాయి ఎంతగానో సంబరపడిపోయింది. ఈ అనుభవాన్ని తాను జీవితాంతం మర్చిపోలేనని ఆకాశమంత ఆనందాన్ని వ్యక్తం చేసింది.