: ప్రాజెక్టులను అడ్డుకుంటున్నామా? సర్కారు చేస్తున్న ప్రచారం భావ్యం కాదు: జీవన్‌రెడ్డి
కేసీఆర్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తమ పార్టీ ప్రాజెక్టులను అడ్డుకుంటోందంటూ సర్కారు ప్రచారం చేయడం భావ్యం కాదని అన్నారు. ప్రాజెక్టులని సమర్థంగా నిర్మించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, వాటిలో జరుగుతున్న జాప్యానికి బాధ్యత సర్కారుదేనని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలపై దృష్టి పెట్టాలని, ఆయన ఒక్క గజ్వేల్‌కి మాత్రమే ముఖ్యమంత్రి కాదని జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సర్కారు అవలంబిస్తోన్న తీరు వల్లే తెలంగాణలో చేపట్టిన ప్రాజెక్టులు పూర్తి కావడం లేదని ఆయన అన్నారు. సర్కారు తమ ప్రచార ఆర్భాటాలు మానుకోవాలని ఆయన సూచించారు. న్యాయస్థానం ప్రభుత్వానికి మొట్టికాయలు వేస్తోన్నప్పటికీ, సర్కారు తీరులో మాత్రం మార్పు కనపడడం లేదని ఆయన విమర్శించారు.