: దేశంలో కిడ్నీ జబ్బులు తీవ్రంగా పెరిగిపోతున్నాయి: ప్రధాని మోదీ
వైద్య రంగంలో ఎంతో అభివృద్ధి సాధించాం కానీ, రోగనిరోధకత వ్యవస్థలను సక్రమంగా రూపొందించలేకపోయామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. టౌన్‌హాల్ తరహాలో ఢిల్లీలోని ఇందిరా గాంధీ మైదానంలో నిర్వహిస్తోన్న ప్రజావేదికలో ఆయన ప్రజలతో ముచ్చటిస్తూ.. ‘దేశంలో కిడ్నీ జబ్బులు తీవ్రంగా పెరిగిపోతున్నాయి. లక్షల మంది పిల్లలలకు టీకాలు పడడం లేదు. వైద్యం ఖరీదయిపోవడంతో పేదలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ అంశాలనే దృష్టిలో ఉంచుకొని కొత్త ఇన్సూరెన్స్ పథకంపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నాం, ఆరోగ్యం అన్నది ప్రతి ఒక్కరికి సముచితంగా అందాలి’ అని వ్యాఖ్యానించారు. వైద్య రంగంలో అభివృద్ధి సాధించినా దేశంలో ఎంతో మందికి స్వచ్ఛమైన తాగునీరు కూడా అందడం లేదని, దీంతో ఎన్నో రోగాల బారిన పడాల్సి వస్తోందని మోదీ అన్నారు. ఆ లోటు భర్తీ చేస్తామని చెప్పారు. స్వచ్ఛభారత్ అనేది జబ్బులపై పోరాటమని దాన్ని ఇంకా ముందుకు తీసుకెళదామని మోదీ పిలుపునిచ్చారు. ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తించడమే గుడ్ గవర్నెన్స్ అని ఆయన అన్నారు. పౌరపాలన సరిగా లేకపోతే ప్రజాస్వామ్యానికి అర్థం లేదని అన్నారు. అన్ని విషయాల్లో ప్రజలు ప్రశ్నించేతత్వాన్ని నేర్చుకోవాలని ఆయన సూచించారు.