: పుష్కరాల పేరుతో చంద్రబాబు 'షో' నిర్వహిస్తున్నారు: కాంగ్రెస్ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు కృష్ణా పుష్కరాలకు ఎంతో హడావుడి చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు తీరు చూస్తుంటే తన ఇంట్లో శుభకార్యాన్ని చేపడుతున్నట్లు ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ఇతర ఏ నాలుగు రాష్ట్రాల్లోనూ పుష్కరాల సందర్భంగా ఇలాంటి హడావుడి కనిపించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. అభివృద్ధి, సౌకర్యాల పేరుతో ముఖ్యమంత్రి దేవాలయాలు కూలగొట్టారని, మరోవైపు పుష్కరాల పేరుతో షో నిర్వహిస్తున్నారని రామచంద్రయ్య అన్నారు. తమ పార్టీ నేత కేవీపీ రాజ్యసభలో పెట్టిన ప్రత్యేక హోదా ప్రైవేటు బిల్లుపై చంద్రబాబు, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు. అందుకే రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఆ బిల్లును లోక్సభకు పంపారని ఆయన వ్యాఖ్యానించారు.