: ట్రాయాంగిల్ లవ్ ఎఫెక్ట్!... చెల్లితో కలిసి చెరువులోకి దూకేసిన యువతి, పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ ప్రియుడు!
హైదరాబాదులోని నేరెడ్ మెంట్ కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు నిన్న చెరువులోకి దూకిన ఘటనలో కొత్త కోణం వెలుగుచూసింది. చెరువులోకి దూకి చనిపోయిన అక్కాచెల్లెళ్లలో పెద్దదైన మౌనిక (19) విషయంలో ట్రాయాంగిల్ లవ్ కోణం వెలుగు చూసింది. కామేశ్ అనే యువకుడి వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ మౌనిక సూసైడ్ లేఖ రాసింది. ఈ క్రమంలో నేటి ఉదయం ఆమె ప్రియుడిగా తెరపైకి వచ్చిన నాగార్జున అనే యువకుడు నేరెడ్ మెట్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. కొద్దసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన అతడు పలు కీలక విషయాలను బయటపెట్టాడు. మౌనికకు, తనకు మధ్య ప్రేమాయణం కొనసాగిన మాట వాస్తవమేనని నాగార్జున ఒప్పుకున్నాడు. అయితే కాలక్రమంలో తన నుంచి దూరంగా జరిగిన మౌనిక... కామేశ్ అనే యువకుడికి దగ్గరైందన్నాడు. ఆ తర్వాత తాను మౌనిక గురించి ఆలోచించడమే మానేశానన్నారు. మౌనిక ఆత్మహత్యలో తన ప్రమేయం ఏమీ లేదని అతడు చెప్పాడు. ఇదిలా ఉంటే... తన మృతికి ప్రధాన కారకుడిగా మౌనిక ఆరోపించిన కామేశ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.