: నేనా... తప్పుకోవడమా? నో ఛాన్స్..!: రిటైర్మెంట్ వార్తలను ఖండించిన సెరెనా విలియమ్స్
వింబుల్డన్ టైటిల్స్‌లో 22 గ్రాండ్ స్లామ్ల రికార్డు ఉన్న స్టెఫీ గ్రాఫ్ రికార్డును తాజాగా అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ (34) సమం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రియోలో త్వరలో ప్రారంభం కానున్న ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి సిద్ధమైన సెరెనా.. తన రిటైర్మెంట్‌పై వస్తోన్న వార్తలను కొట్టిపారేసింది. టెన్నిస్‌కు దూరమయ్యే ఆలోచన తనకు లేదని, ఇప్పట్లో రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం లేదని ఆమె పేర్కొంది. రిటైర్మెంట్ నిర్ణయం తన ఎజెండాలోనే లేదని వ్యాఖ్యానించింది. తాను తను ఆడే ఆటను ప్రేమిస్తానని, అంతేగాక, కోర్టులో టెన్నిస్ ఆడటాన్ని ఆరాధిస్తానని సెరెనా విలియమ్స్ పేర్కొంది. పోటీని ఎదుర్కుంటూ ముందుకెళ్లడం అంటే తనకు ఇష్టమని చెప్పింది. తన రిటైర్మెంట్ గురించి తాను ఇంకా నిర్ణయం తీసుకోలేదని, రిటైర్మెంట్ గురించి వస్తోన్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. తన రిటైర్మెంట్ అంశాన్ని తాను స్వాగతించలేనేమో అని వ్యాఖ్యానించింది. ఒకవేళ అటువంటి ఆలోచన తనకు ఉంటే కచ్చితంగా చెబుతానని చెప్పింది. వీలైనన్ని విజయాలు రాబట్టడంపైనే ప్రస్తుతం తన దృష్టి ఉందని పేర్కొంది.