: కుప్పకూలిన వంతెన వద్ద సెల్ఫీ తీసుకున్న మహారాష్ట్ర మంత్రి ప్రకాశ్‌ మెహతా


సెల్ఫీ పిచ్చి రోజురోజుకీ ముదిరిపోతోంది. యువత, సెలబ్రిటీస్‌లోనే కాదు.. ప్ర‌భుత్వాధికారులు, రాజ‌కీయ నాయ‌కుల్లో కూడా. విషాద‌ సంఘటనలు జరిగిన ప్ర‌దేశాల్లో పర్య‌టించిన‌ప్పుడు కూడా సెల్ఫీ దిగాల‌ని ఆరాట‌ప‌డుతూ విమ‌ర్శ‌లపాల‌వుతున్నారు. అటువంటి సంఘ‌ట‌నే మహారాష్ట్రలో తాజాగా మరొకటి చోటుచేసుకుంది. ఇటీవ‌లే ముంబయి-గోవా రహదారిపై మహద్‌ వద్ద వంతెన కుప్పకూలిన విష‌యం విదిత‌మే. ప్ర‌మాదంతో 50 మంది గల్లంతయ్యారు. ఇప్పటి వ‌ర‌కు 14 మంది మృతదేహాలను రెస్క్యూ టీమ్ బ‌య‌ట‌కు తీసింది. అయితే, ఆ ప్రాంతాన్ని సంద‌ర్శించ‌డానికి ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్న‌వీస్‌తో పాటు వచ్చిన ఆ రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి ప్రకాశ్‌ మెహతా అక్క‌డ సెల్ఫీ తీసుకున్నారు. దీంతో ఆయ‌న‌పై ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తోంది. ప్ర‌మాదంలో అంత‌మంది గ‌ల్లంత‌యితే అక్క‌డ సెల్ఫీ తీసుకుంటారా? అంటూ ఆయ‌న రాజీనామాకు కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. మంత్రి ప్ర‌వ‌ర్త‌న‌తో ప్ర‌భుత్వ తీరుని అర్థం చేసుకోవ‌చ్చ‌ని విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది. సెల్ఫీ తీసుకోవ‌డ‌మేగాక‌ ప్ర‌మాద స్థ‌లిని ప‌రిశీలించిన సంద‌ర్భంగా ప్రకాశ్‌ మెహతా ఓ విలేక‌రితో దురుసుగా ప్ర‌వ‌ర్తించారు. ప్ర‌మాదం గురించి మీకు చాలా ఆలస్యంగా తెలిసిందా? అంటూ ఓ విలేక‌రి ఆయ‌న‌ను ప్ర‌శ్నించ‌డంతో ఆయ‌న అత‌నితో దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. త‌మ‌తో మంత్రి ప్ర‌వ‌ర్తించిన తీరుకి మీడియా ప్రతినిధులు నిర‌స‌న‌గా ఆందోళన చేశారు.

  • Loading...

More Telugu News