: ప్రధానిని రావద్దంటూ లేఖ రాశారు.. మరోసారి కాంగ్రెస్ దుర్బుద్ధి బయటపడింది: హరీశ్‌రావు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎల్లుండి తెలంగాణ పర్యటనకు రానున్న నేపథ్యంలో ఆయన పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలంగాణ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మెదక్ జిల్లా-కోమటి బండలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మోదీ ప్రధాని అయిన తరువాత తొలిసారి తెలంగాణకు వస్తున్నారని ఆయనను రాష్ట్రప్రజలు ఎంతో ప్రేమగా ఆహ్వానిస్తున్నారని తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతల దుర్బుద్ధి బయటపడిందని, మోదీని తెలంగాణకు రావద్దంటూ, మిషన్ భగీరథ ప్రారంభించొద్దంటూ లేఖరాశారని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని కాంగ్రెస్ కోరడం లేదు కాబట్టే ఇలా వ్యవహరిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హరీశ్‌రావు తెలిపారు. ప్రధాని చేతుల మీదుగా 5 శంకుస్థాపన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఆయన పర్యటన కోసం 4 హెలీప్యాడ్లు సిద్ధంగా ఉంచామని పేర్కొన్నారు. ప్రజలు బహిరంగ సభకు తరలిరావడానికి ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు, ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. 200 తాత్కాలిక టాయిలెట్లు అందుబాటులో ఉంచుతున్నట్లు హరీశ్ తెలిపారు. బహిరంగ సభలో 2 లక్షల మంది కూర్చునేలా ఏర్పాట్లు చేసినట్లు, ప్రధాని కూర్చునే వేదికపై 18 మంది నేతలు కూర్చునేలా ఏర్పాట్లు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.