: ప్రత్యేక హోదాతో నాకేంటి సంబంధం?: మంత్రి కామినేని సంచలన వ్యాఖ్యలు
రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందా? రాదా? అన్న విషయమై మాట్లాడే స్థాయి తనకు లేదని, అసలు హోదాతో తనకు సంబంధం ఏంటని ఆంధ్రప్రదేశ్ మంత్రి కామినేని శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన, తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ, ప్రజలకు సేవ చేయడంపైనే దృష్టిని సారిస్తానని, మిగతా విషయాలు, వివాదాల గురించి పట్టించుకోనని అన్నారు. రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యలు చూసుకుంటారని అన్నారు. ఏపీ ప్రజల సెంటిమెంటుగా ఉన్న హోదా విషయంలో తనకేమీ సంబంధం లేదని మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి చెప్పడాన్ని విపక్షాలు తప్పుబడుతున్నాయి.