: ఇండియా కోసం ఇండియాలోనే ఎఫ్-16 యుద్ధ విమానాల తయారీ... షరతులు వర్తిస్తాయంటున్న లాక్ హీడ్ మార్టిన్
అమెరికా రక్షణ రంగ దిగ్గజం ఇండియాకు వచ్చి, ఇక్కడే ఎఫ్-16 యుద్ధ విమానాలను తయారు చేసి వాయుసేన అవసరాలు తీర్చడంతో పాటు, ఇక్కడి నుంచి ఎగుమతులూ చేపట్టనున్నట్టు వెల్లడించింది. అయితే, తమకు కొన్ని షరతులు ఉన్నాయని, వాటిని భారత ప్రభుత్వం అంగీకరిస్తేనే వస్తామని స్పష్టం చేసింది. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న లాక్ హీడ్ మార్టిన్ బిజినెస్ డెవలప్ మెంట్ విభాగం హెడ్ రాన్ డెల్ ఎల్ హోవార్డ్ ఈ విషయాన్ని వెల్లడించారు. యూఎస్ లో నెలకొల్పిన ఎఫ్-16 బ్లాక్ 70ని పూర్తిగా ఇండియాకు తరలించాలని నిర్ణయించినట్టు తెలిపారు. కాగా, ఇక్కడ తయారు చేసే యుద్ధ విమానాలను పాక్ కు విక్రయించకుండా చూడాలని భారత్ కోరగా, అందుకు అంగీకరించారా? లేదా? అన్న విషయాన్ని మాత్రం రాన్ డెల్ స్పష్టంగా చెప్పలేదు. ఈ విషయాన్ని భారత్, అమెరికా ప్రభుత్వాలు చర్చించి, ఆపై నిర్ణయం తీసుకుంటాయని వెల్లడించారు. ప్రస్తుతం ఫోర్ట్ వర్త్ లో ఉన్న ప్రొడక్షన్ యూనిట్ ను ఇక్కడికి తేవాలంటే, భారత వాయుసేన ఈ విమానాలను కొనుగోలు చేయాల్సిందేనన్న నిబంధన విధించారా? అన్న ప్రశ్నకు 'అవును' అని సంస్థ భారత ఎగ్జిక్యూటివ్ అభయ్ పరాంజిపే వ్యాఖ్యానించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఆర్డర్లు ఇస్తామన్న హామీని తాము ఆశిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటివరకూ లాక్ హీడ్ మార్టిన్ 4,588 ఎఫ్ 16లను తయారు చేసి వివిధ దేశాలకు విక్రయించింది. ఇటీవలి కాలంలో పోటీ సంస్థలైన అమెరికాకు చెందిన బోయింగ్ ఎఫ్/ఏ - 18ఈ విమానాలతో, ఫ్రాన్స్ కేంద్రంగా సేవలందిస్తున్న దస్సాల్ట్ ఏవియేషన్ తయారు చేస్తున్న రఫాలే అమ్మకాలు పెరుగుతుండటంతో లాక్ హీడ్ మార్టిన్ ఒత్తిడిని ఎదుర్కుంటోంది. దస్సాల్ట్ ఏవియేషన్, బోయింగ్ సంస్థలు సైతం ఇండియాకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రస్తావించిన హోవార్డ్ "మాకు అవకాశం లభిస్తుందనే భావిస్తున్నాం. ఇండియాకు కేవలం ప్రొడక్షన్ యూనిట్ ను తరలించడం మాత్రమే కాకుండా, ఇక్కడి నుంచి ఎగుమతులు చేస్తామని కూడా చెబుతున్నాం" అన్నారు.