: హైకోర్టు నేడు బందే!... విధులు బహిష్కరించిన టీ లాయర్లు, ఏపీ న్యాయవాదులు!
హైదరాబాదులోని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో నేడు కార్యకలాపాలన్నీ స్తంభించనున్నాయి. కోర్టు ప్రాంగణంలో కేసుల వాదనలు వినిపించే ఒక్క లాయర్ కూడా కనిపించే అవకాశాలు లేవు. దీంతో నేడు హైకోర్టు బందేనన్న వాదన వినిపిస్తోంది. హైకోర్టు విభజనను డిమాండ్ చేస్తూ తెలంగాణ న్యాయవాదులు, న్యాయాధికారులు చేపట్టిన నిరసనలపై రాష్ట్ర ఉన్నత కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. నాడు సమ్మెకు మద్దతు పలికిన పలువురు న్యాయాధికారులను హైకోర్టు సస్పెండ్ చేసింది. తాజాగా రెండు రోజుల క్రితం సమ్మెలో ఘాటు వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో కొందరు టీ లాయర్లకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు నిరసనగా హైకోర్టులోని టీ లాయర్లంతా ఆందోళనకు దిగుతున్నారు. కోర్టు కార్యకలాపాలను స్తంభింపజేయాలని వారు భావిస్తున్నారు. మరోవైపు ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ఏపీకి చెందిన న్యాయవాదులు కూడా నేడు నిరసన చేపట్టనున్నారు. వెరసి రెండు రాష్ట్రాలకు చెందిన న్యాయవాదులు ఒకే రోజు సమ్మెకు దిగుతుండటంతో నేడు హైకోర్టు కార్యకలాపాలు పూర్తిగా స్తంభించనున్నాయి.