: మిషన్ భగీరథ ప్రారంభించొద్దు.. మోదీకి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లేఖ
తెలంగాణ పర్యటనకు రానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈరోజు బహిరంగ లేఖను రాశారు. మోదీ చేయనున్న తెలంగాణ పర్యటనను ముఖ్యమంత్రి కేసీఆర్ తన వ్యక్తిగత ప్రచారానికి వాడుకుంటున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు. మిషన్ భగీరథను ప్రారంభించొద్దని ఆయన సూచించారు. వైఎస్సార్ హయాంలోనే మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరుతో ప్రారంభమైన ఎల్లంపల్లి-హైదరాబాద్ సాగునీటి ప్రాజెక్టును మిషన్ భగీరథగా మార్చేశారని ఆయన అన్నారు. కాంగ్రెస్ హయాంలోనే రూ.3,350 కోట్లతో ఆ ప్రాజెక్ట్ ప్రారంభమైందని ఉత్తమ్ పేర్కొన్నారు. విభజన చట్టంలో తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను ప్రధాని అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు నిధులను కేటాయిస్తున్నట్లు మోదీ తన పర్యటనలో ప్రకటించాలని సూచించారు.