: ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేస్తామని చెప్పలేకపోయిన పాక్... రూ.2,100 కోట్లను నిలిపివేసిన అమెరికా


ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేస్తామని చెప్పలేకపోయిన పాకిస్థాన్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్థాన్ కు 300 మిలియన్ డాలర్ల సైనిక సహాయాన్ని అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ స్తంభింపజేసింది. హక్కానీ తీవ్ర వాద సంస్థపై పాక్ సర్కారు సరైన చర్యలు తీసుకుంటుందని అమెరికన్ కాంగ్రెస్ కు ఆ దేశ రక్షణ మంత్రి ఆస్టాన్ కార్టర్ కచ్చితంగా చెప్పలేకపోవడంతో సైనిక సాయం నిలిచిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా కార్యకలాపాలకు పాక్ ఇచ్చే మద్దతుకు బదులుగా భాగస్వామ్య మద్దతు నిధి కింద అగ్రరాజ్యం ఈ సైనిక సాయమందిస్తోంది. రక్షణ మంత్రి ఎలాంటి హామీ ఇవ్వలేకపోవడంతో 2015వ సంవత్సరానికి చెందిన ఆ మొత్తంలో ఇక ఎలాంటి అదనపు చెల్లింపులు చేసే అవకాశం లేదని పెంటగాన్ అధికార ప్రతినిధి తెలిపారు. అయితే, తీవ్ర వాద సంస్థలపై పాకిస్థాన్ చేసే దాడులను మాత్రం తాము ప్రోత్సహిస్తూనే ఉంటామన్నారు. భాగస్వామ్య మద్దతు నిధి కింద 2002 వరకూ 14 బిలియన్ డాలర్ల అమెరికా సాయం పొందిన పాకిస్థాన్ ఆ నిధిని అత్యధికంగా పొందిన దేశాల్లో పెద్దది. ఈ ఏడాది 900 మిలియన్ డాలర్ల సాయం పాక్ కు చేయాలని అమెరికా నిర్ణయించింది. వాటిలో 300 మిలియన్ డాలర్లను పాకిస్థాన్ చేసే పోరాటంపై అమెరికా రక్షణ మంత్రి ఇచ్చే హామీ ఆధారంగా అందజేయనున్నారు. అయితే, అమెరికా రక్షణ మంత్రిని హామీ అడగడం ఇదే తొలిసారి.

  • Loading...

More Telugu News