: నోరెత్తను... నేను జీఎస్టీపై మాట్లాడితే ఘర్షణలు జరుగుతాయ్: సుబ్రహ్మణ్య స్వామి
ఏ అంశంపైన అయినా తనదైన శైలిలో స్పందించి, ఎంతో కొంత వివాదాన్ని సృష్టించే బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి జీఎస్టీ విషయంలో మాత్రం నోరెత్తకూడదని నిర్ణయించుకున్నారు. తాను మాట్లాడితే, గొడవలు అవుతాయని ఆయన అంటుండటం గమనార్హం. తన ట్విట్టర్ ఖాతాలో "దేశ భక్తులైన నెటిజన్లు ఎవరైనా వస్తు సేవల పన్ను పాత్ర, దాని అవసరం ఎంత ఉందన్న విషయమై సమగ్ర అధ్యయనం చేశారా?" అని స్వామి ప్రశ్నించగా, ఓ ఫాలోవర్, బిల్లుపై మీ అభిప్రాయాలను ఎందుకు చెప్పలేదని ఎదురు ప్రశ్నించాడు. అతని ప్రశ్నకు సమాధానంగా "నా ఆర్థిక శాస్త్ర ప్రావీణ్యంతో మాట్లాడితే, పార్టీ విధేయత కోల్పోతాను. అది ఘర్షణలకు, లేనిపోని వివాదాలకూ తావిస్తుంది" అని చెబుతూ, తన అభిప్రాయం బీజేపీ అధిష్ఠానం నొచ్చుకునేలా ఉంటుందని చెప్పకనే చెప్పారు. జీడీపీ పెరిగేందుకు జీఎస్టీ మార్గం కాదని, అధిక పెట్టుబడులు, కార్మిక ఉత్పాదకత, నైపుణ్య వృద్ధి మాత్రమే అవసరమని అన్నారు.