: ఢిల్లీలో మరో దారుణం!... నేపాలీ యువతిపై ముగ్గురు మృగాళ్ల కీచక పర్వం!
దేశ రాజధాని ఢిల్లీలో మహిళలపై అకృత్యాలకు అడ్డుకట్ట పడటం లేదు. నగరంలో జరిగిన నిర్భయ ఘటనతో శిక్షలను కఠినతరం చేసినా... మృగాళ్లలో ఏమాత్రం మార్పు రావడం లేదు. తాజాగా మరో యువతి ముగ్గురు మృగాళ్ల చేతిలో నరకాన్ని చవిచూసింది. వివరాల్లోకెళితే... నేపాల్ నుంచి వలస వచ్చిన ఓ 22 ఏళ్ల యువతి దక్షిణ ఢిల్లీలోని అశోక్ నగర్ లో నివాసముంటోంది. ఉద్యోగాన్వేషణలో భాగంగా ఆమెకు అదే ప్రాంతానికి చెందిన యోగేశ్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఎలాగోలా మంచి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికిన యోగేశ్... మొన్న (సోమవారం) అక్కడి స్వీట్ షాప్ వద్దకు ఆమెను రప్పించాడు. ఆ తర్వాత ఆ యువతిని యోగేశ్ తన ఫ్లాట్ కు తీసుకెళ్లాడు. అక్కడ అప్పటికే అతడి ఇద్దరు స్నేహితులు అమిత్, సాహిల్ ఉన్నారు. అమిత్ బర్త్ డే పేరిట విందు చేసుకున్న యువకులు బాధితురాలికి బలవంతంగా మద్యం తాగించారు. ఆ తర్వాత ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం తనను ఫ్లాట్ లోని బాత్ రూంలో బంధించగా, వారి కళ్లు గప్పి ఆ యువతి తప్పించుకుంది. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఇప్పటికే ముగ్గురు దుర్మార్గుల్లోని అమిత్ ను అరెస్ట్ చేశారు. మిగిలిన ఇద్దరి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.