: విభజనతో నవ్యాంధ్రకు ‘పన్ను’ అన్యాయం!... న్యాయం కోసం సుప్రీం తలుపు తట్టనున్న చంద్రబాబు సర్కారు!


రాష్ట్ర విభజనతో నవ్యాంధ్రకు అన్నింటా అన్యాయమే జరుగుతోందట. ఇప్పటికే నీటి కేటాయింపులు, పదో షెడ్యూల్ సంస్థల నిదులు, ఆస్తుల పంపిణీలో అన్యాయం జరిగిందని ఆరోపిస్తున్న ఏపీ సర్కారు... తాజాగా పన్నుల విషయంలోనూ అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు నిన్న విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన ఆదాయార్జన శాఖలపై జరిగిన సమీక్షలో ఈ కొత్త అంశం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళితే... తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో ఆయా పరిశ్రమలు రాష్ట్రవ్యాప్తంగా తమ కర్మాగారాలు ఏర్పాటు చేసుకుని వ్యాపారం సాగించినా... రాజధాని హైదరాబాదులోనే తమ కేంద్ర కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నును ఆయా సంస్థలు కేంద్ర కార్యాలయాలున్న హైదరాబాదులోనే చెల్లించాయి. అయితే రాష్ట్రాన్ని విభజించిన సందర్భంగా రూపొందించిన విభజన చట్టంలో ఈ పన్నుల విభజనపై కేంద్రం దృష్టి సారించలేదు. ఫలితంగా తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఆయా పారిశ్రామిక సంస్థలు రెండు రాష్ట్రాల్లో తమ కర్మాగారాలను కొనసాగించడమే కాకుండా రెండింటా వ్యాపారం చేసుకుంటూ పన్నును మాత్రం హైదరాబాదులోనే చెల్లిస్తున్నాయి. ఈ పన్ను మొత్తం తెలంగాణ ఖాతాలోకి పోతోంది. వెరసి ఏపీలో జరుగుతున్న వ్యాపారానికి సంబంధించిన పన్ను కూడా తెలంగాణ ఖాతాలోనే జమ అవుతోంది. ఈ మేరకు విభజన చట్టంలో కేంద్ర స్పష్టమైన నిబంధన పెట్టింది. ఈ నిబంధనపై నాడు అంతగా పట్టించుకోని ఏపీ సర్కారు తాజాగా దీనిపై దృష్టి సారించింది. ఈ ఒక్క నిబంధన వల్ల ఏటా తమకు రూ.3 వేల కోట్ల మేర నష్టం జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేసినా మోదీ సర్కారు అంతగా స్పందించలేదు. ఫలితంగా న్యాయం చేయాలంటూ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. పదో షెడ్యూల్ సంస్థ విభజనకు సంబంధించి సుప్రీంకోర్టులో వచ్చిన అనుకూల తీర్పు నేపథ్యంలో ‘పన్ను’ అన్యాయంపైనా సుప్రీంకోర్టునే ఆశ్రయించాలని చంద్రబాబు సర్కారు నిర్ణయించింది. త్వరలోనే దీనికి సంబంధించి సమగ్ర వివరాలతో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News