: బహ్రెయిన్ లో భారతీయ బాలిక కిడ్నాప్ కథ సుఖాంతం
బహ్రెయిన్ లో భారతీయ బాలిక సారా (5) కిడ్నాప్ కథ సుఖాంతమైంది. ఆ బాలికను కారులో ఉంచిన ఆమె తల్లి షాపులో వాటర్ బాటిల్ కొనుగోలు చేసేందుకు వెళ్లగా, ఇద్దరు వ్యక్తులు కారుతో సహా ఉడాయించారు. దీంతో సారా తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, 25 పహారా వాహనాలను రంగంలోకి దించిన బహ్రెయిన్ కాపిటల్ గవర్నేట్ పోలీసు జనరల్ డైరెక్టర్ కలోనియల్ ఖలీద్ ఆల్ థవాది హూరా ప్రాంతంలో నిందితురాలి ఇంట్లో పాపను గుర్తించినట్టు తెలిపారు. కిడ్నాపర్లు సారాకు ఎలాంటి ముప్పు తలపెట్టలేదని, సారా ఆరోగ్యంగా ఉందని ఆయన చెప్పారు. పోలీస్ స్టేషన్ లో తల్లిని చూసిన సారా పరుగెత్తుకుంటూ తల్లిని చేరుకుని ఒదిగిపోవడం స్టేషన్ అధికారులను కదిలించింది. కాగా, సారా కిడ్నాప్ పై మేనమామ అనిశ్ ఛార్లెస్ అనుమానం వ్యక్తం చేశాడు. ఈ కిడ్నాప్ లో పాప తండ్రి హస్తం ఉందని ఆరోపించాడు. పాప తండ్రి భారత్ లో ఉంటున్నాడని, మూడేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారని, అయితే ఆయన కుట్రచేసే అవకాశం లేకపోలేదని అనిశ్ ఆరోపించాడు. పాప కిడ్నాప్ కథ సుఖాంతం కావడం పట్ల విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ హర్షం వ్యక్తం చేశారు.