: హైదరాబాదు చేరుకున్న ఎస్పీజీ!... మోదీ పర్యటన భద్రతపై సమీక్ష!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు సమయం దగ్గరపడుతోంది. ఈ క్రమంలో ప్రధాని భద్రతా వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) అధికారులు అప్పుడే హైదరాబాదులో ల్యాండయ్యారు. డిల్లీలో నేటి ఉదయం బయలుదేరిన ఎస్పీజీ అధికారులు కొద్దిసేపటి క్రితం హైదరాబాదు చేరుకున్నారు. ప్రధాని పర్యటించే ప్రాంతాల్లో ముందుగా భద్రతా పరిస్థితులను సమీక్షించనున్న ఎస్పీజీ... స్థానిక భద్రతపై సంతృప్తి చెందితేనే ప్రధాని పర్యటనకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లు. ఈ క్రమంలో హైదరాబాదు వచ్చిన ఎస్పీజీ అధికారులతో తెలంగాణ పోలీసులు భేటీ అయ్యారు. ప్రధాని మోదీ పర్యటించాల్సిన ప్రాంతాలకు సంబంధించిన రూట్ మ్యాప్ ను వారు ఎస్పీజీ అధికారుల ముందు పెట్టారు. తెలంగాణ పర్యటనలో భాగంగా మోదీ... మెదక్ జిల్లా గజ్వేల్, కరీంనగర్ జిల్లా రామగుండం, హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలలో జరిగే కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు. ఈ ప్రాంతాల్లో భద్రతా పరిస్థితులపై ప్రస్తుతం ఎస్పీజీ అధికారులు సమీక్షిస్తున్నారు.