: అదృష్టం అంటే అదే...5 పౌండ్లు పెట్టి కొన్న కుర్చీలో 5 లక్షల విలువైన ఆభరణాలు


కాలం కలిసి వస్తే అదృష్టం ఎదురొస్తుందంటారు. బ్రిటన్ కు చెందిన ఏంజెలా మిల్నర్, అంగుస్ దంపతులను చూస్తే అది నిజమేననిపిస్తుంది. బ్రిటన్ కు చెందిన ఈ దంపతులు ఓ ఆక్షన్ కంపెనీ నిర్వహించిన వేలంలో ఉంచిన 1900 కాలం నాటి ఓ కుర్చీ వారిని ఆకట్టుకోవడంతో అందులో పాల్గొన్నారు. కేవలం 5 పౌండ్లు చెల్లించి ఆ కుర్చీని సొంతం చేసుకున్నారు. కుర్చీని కొనడమైతే కొనేశారు కానీ, దానిని పెద్దగా ఉపయోగించకపోవడంతో 5 పౌండ్లు అనవసరంగా ఖర్చు చేశామని దానిని మూలపడేశారు. కొన్నాళ్లకి దానిని అలా వదిలేయడం ఇష్టం లేక ఆ దంపతులు మరమ్మతుల కోసం దానిని బయటకు తీశారు. దాని దుమ్ముదులుపుతుండగా అంగుస్ కు వజ్రాల చెవికమ్మలు, వజ్రపుటుంగరం, వ్రజాలతో కూడిన హెయిర్ క్లిప్ దొరికింది. వాటిని జ్యూయలరీ దుకాణానికి తీసుకెళ్లి తనిఖీ చేయించగా, అవి వజ్రాలని, వాటి ధర 5 లక్షలకుపైగా ఉంటాయని నిర్ధారించారు. దీంతో సంబరపడ్డ అంగుస్... మౌనంగా ఏమీ ఎరగనట్టు ఇంటికి చేరి... వివాహ వార్షికోత్సవ సందర్భంగా వజ్రపుటుంగరాన్ని భార్య వేలికి తొడిగాడు. దీంతో ఆమె ఉబ్బితబ్బిబైపోయింది. తరువాత ప్రేమికుల రోజున వజ్రపు చెవి కమ్మలు బహూకరించాడు. దీంతో మురిసిపోతున్న ఆమెకు ఈస్టర్‌ రోజున క్లిప్‌ ను గిఫ్ట్ గా ఇచ్చాడు. దీంతో భర్త చూపిన ప్రేమకు ఆమె ఉప్పొంగిపోతున్న దశలో ఆమెకు అసలు విషయం చెప్పేశాడు. దీంతో ఆ ఇల్లాలి సంబరం అంబరాన్ని తాకింది.

  • Loading...

More Telugu News