: ఐసీయూలో చేరిన సోనియా గాంధీ
ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ ఢిల్లీలోని సర్ గంగారం ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న సోనియా గాంధీ అనారోగ్యానికి గురికావడంతో మధ్యలోనే వెనుదిరిగిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి నేరుగా ఆర్మీ ఆసుపత్రిలో జాయిన్ అయిన సోనియా గాంధీ పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాకపోవడంతో ఆమెను అక్కడి నుంచి గంగారాం ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో జాయిన్ చేశారు. అయితే ఆమె ఇంకా డీహైడ్రేషన్, ఎలక్ట్రొలైట్ ల అసమతౌల్యంతో బాధపడుతున్నారని తెలుస్తోంది. యూపీ ర్యాలీలో అనారోగ్యానికి గురికావడంతో ఆమె కిందపడగా, ఆమె మోచేయి విరిగినట్టు కూడా తెలుస్తోంది. దీంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చే సమయంలో సరిగ్గా మాటలు కూడా రాలేదు. బాగా మత్తుగా ఉన్నారని వైద్యులు పేర్కొంటున్నారు. పల్మనాలజిస్టు డాక్టర్ అరూప్ బసు బృందం ఆమెకు వైద్య సేవలందిస్తున్నారని గంగారాం ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అకస్మాత్తుగా అనారోగ్యానికి గురికావడంతో కాంగ్రెస్ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆమెను ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిత్యం కనిపెట్టుకుని ఉంటుండగా, అల్లుడు రాబర్ట్ వాద్రా ఆమె వద్దకు వచ్చివెళ్తున్నట్టు తెలుస్తోంది.