: చావో రేవో తేల్చుకునే వరకూ పోరాడతాం: కాపు ఉద్యమ నేత ముద్రగడ
చావో రేవో తేల్చుకునే వరకు తమ పోరాటం ఆగదని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం చల్లపల్లిలోని సీనియర్ రాజకీయనేత దంగేటి కొండయ్య ఇంట్లో ఈరోజు ఆయన కాపు నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ, రాయలసీమ తరహాలో ప్రతిఒక్కరూ ఉద్యమించాలని, కాపు సామాజిక వర్గంలో ఉన్న పౌరుషానికి తాళం తీయాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. తుని ఐక్య గర్జనతో కాపులు ఎంత కలిసికట్టుగా ఉంటారో బహిర్గతమైందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన గడువు తర్వాత ఉద్యమ కార్యాచరణపై కాపు నాయకులందరితో సమాలోచన చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం కాపు నేతలు నల్లా విష్ణు, ఆకుల రామకృష్ణ, కల్వకొలను తాతాజీ, వాసిరెడ్డి ఏసుదాసు మాట్లాడుతూ, శాంతియుత మార్గంలో కాపు యువత ఉద్యమించాలని, డిమాండ్లు నెరవేర్చుకోవాలని సూచించారు. కాగా, కాపు రిజర్వేషన్ల కోసం నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో చల్లపల్లిలో గుండెపోటుతో మృతి చెందిన గొలకోటి బాపన్ననాయుడు కుటుంబాన్ని ముద్రగడ పరామర్శించారు. బాపన్న నాయుడు భార్య అమ్మాజీతో ఆయన మాట్లాడారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని ముద్రగడ హామీ ఇచ్చారు.