: ‘హోదా’ కోసం నినదించిన మహిళల చీరలు చించుతారా?... తిరుపతిలో చిరిగిన చీరలను ప్రదర్శించిన వైసీపీ!
ఏపీకి ప్రత్యేక హోదా కోసం నిన్న జరగిన రాష్ట్ర బంద్ లో భాగంగా ఆందోళనకు దిగిన తమ పార్టీ కార్యకర్తలపై పోలీసులు దురుసుగా వ్యవహరించారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం తిరుపతిలో రోడ్డెక్కిన వైసీపీ మహిళా కార్యకర్తలు నిన్నటి ఆందోళనలో భాగంగా చిరిగిన చీరలను ప్రదర్శించారు. పార్టీ మహిళా విభాగం చేపట్టిన ఈ నిరసనకు వైసీపీ కీలక నేతలు భూమన కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి తదితరులు మద్దతు తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేసిన తమ పార్టీ మహిళా కార్యకర్తలకు మద్దతుగా నిలబడాల్సింది పోయి ప్రభుత్వం చీరలు చించి అవమానపరిచిందని భూమన ఆరోపించారు. మహిళలను పురుష పోలీసులు లాగేయడమే కాకుండా వారి మెడల్లోని పుస్తెల తాడులను కూడా తెంచారని ఆరోపించారు.